ఒక వ్యవస్థను నూతనంగా ఏర్పాటు చేసినప్పుడు దానిలో కొన్ని లోపాలు సహజం, ఆ లోపాల కారణంగా ఆ వ్యవస్థను పూర్తిగా తొలగించాలని అనడం మూర్ఖత్వం.
మన దేశంలో సైన్స్ మరియు టెక్నాలజీ రివల్యూషన్ని మొదలుపెట్టింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు, దాని కారణంగానే వారిని భారత సమాచార సాంకేతికత & టెలికాం విప్లవానికి పితామహుడుగా పీల్చుకుంటాం.
భారతదేశంలో కంప్యూటర్, టెక్నాలజీ వ్యవస్థ ప్రవేశపెట్టడం ద్వారా సాంకేతిక యుగాన్ని తీసుకురావాలనే ఆయన దార్శనికత నేడు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయి. నాడు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టిన వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉండవచ్చు కానీ నాడు ఆ వ్యవస్థని రద్దు చేయలేదు, ఆ లోపాలను సరిచేసి వ్యవస్థను ముందుకు నడిపించడం ద్వారా ఈరోజు దేశ అభివృద్ధిలో వారి నాటి ఆలోచనలు దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతున్నాయి. ఇది మీరు సత్యం కాదని చెప్పగలరా?
అలాంటి ఆశయాలతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను కొంతమంది అవినీతి అధికారుల నుంచి దళారి వ్యవస్థ నుంచి రైతులకు విముక్తి కలిగించాలని ఆలోచనతో, ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టి దానిద్వారా రైతులకు మంచి చేయాలని దృఢ సంకల్పంతో ధరణి లాంటి వ్యవస్థను తీసుకువచ్చారు.
దాని ద్వారా రైతులకు లాభం జరిగింది, జరుగుతుంది అనేది వాస్తవం, ఒక వ్యవస్థను సృష్టించినప్పుడు వాటిలో కొన్ని లోపాలు దొరలడం అనేది సహజం. దానిని అందరూ ఆమోదించవలసిందే, అలాగే ధరణి వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయనేది వాస్తవం. ఈ వ్యవస్థ అనేది ఒక నిరంతర ప్రక్రియ, ప్రక్రియలో ఆ లోపాలను కూడా ప్రభుత్వం సరిచేస్తుంది, సరిచేయాలనేది మనం వాదించాలి అంతేకానీ తొలగించాలని కాదు.
నిజానికి ధరణి పోర్టల్ అనేది ఒక అద్భుతమైన ఆన్లైన్ వ్యవస్థ, వందల వేల రోజులు జరగవలసిన పనులు కేవలం నిమిషాల్లో జరిగిపోతున్నాయి, ఒక ఆన్లైన్ వ్యవస్థను సృష్టించినప్పుడు దానిలో కొన్ని లోపాలు అనేది సహజం, అదే మాదిరిగా ధరణిలో కూడా వాటిని సరిచేసి ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేస్తే ధరణి ఒక సూపర్ స్పీడ్ సూపర్ మాన్ ప్రభుత్వ అధికారి అవుతుంది కానీ అది చేయడంలో ప్రభుత్వం కొద్దిగా విఫలమైందని చెప్పవచ్చును.
ఈ విషయంలో ప్రభుత్వం గమనించాలి & ఆలోచించాలి :-
అది సరి చేయడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు, ప్రభుత్వం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఒక ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యవస్థలో పనిచేసే ప్రభుత్వ అధికారులు, ఆ వ్యవస్థపై పట్టు ఉండాలి కానీ నేడు ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను చూసినట్లయితే అది కనబడడం లేదు.
అది ఎలాగా అంటే ఒక ఎమ్మార్వో కానీ ఇతర సంబంధిత అధికారులు కానీ భూములు వాటికి సంబంధించిన రికార్డుల పట్ల వారికి అవగాహన ఉండవచ్చు కానీ వారిలో చాలామందికి టెక్నాలజీ పట్ల వాటిని ఉపయోగించడం పట్ల అవగాహన లేదు, దాని కారణంగానే కిందిస్థాయిలో కొన్ని లోపాలు ఏర్పడుతున్నాయి.
చాలా చోట్ల ఎమ్మార్వోలు చేయవలసిన పనులు వారి కింది స్థాయి వ్యక్తులు చేస్తున్నారు, ఇక్కడే అవినీతికి అడుగులు పడుతున్నాయి. ఇదే నేటి రైతుల పాలిట శాపంగా మారుతుంది, దీనిలో ధరణి పోర్టల్ వ్యవస్థ లోపం లేదు కానీ వ్యవస్థ నడిపే అధికారుల్లో లోపం ఉంది .
మరో ముఖ్య విషయం ప్రభుత్వం గమనించాలి, ఆలోచించాలి . అదేంటంటే ప్రభుత్వం ఒక ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పినప్పుడు, ఆ ప్రవేట్ వ్యవస్థతో సమబద్ధంగా ప్రభుత్వ వ్యవస్థ కూడా నడిపించాలి.
అది ఎలాగా అంటే ధరణి ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రైవేట్ సంస్థకు డెవలప్మెంట్ కు హక్కులు ఇచ్చినప్పుడు, సమాంతరంగా ప్రభుత్వం కూడా అలాంటి వ్యవస్థను ప్రభుత్వంలో కూడా ఏర్పాటు చేసుకోవాలి,
ఉదాహరణ: ధరణిని ఒక ప్రైవేట్ సంస్థకి నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు, దానిని డెవలప్ చేయడానికి ఆ సంస్థలో వివిధ శాఖల్లో వివిధ ఉద్యోగులు పనిచేస్తారు, అదే విధంగా ప్రభుత్వం కూడా సమాంతరంగా ఆ వ్యవస్థను ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకోవాలి.
ఎందుకంటే లోపాలు వెతకడంలో, లోపాలను పరిష్కరించడంలో ప్రభుత్వంలో ఉన్న ఆ వ్యవస్థ టెక్నాలజీ అధికారులు దోహదపడతారు. నాకు తెలిసి ధరినీలో ఈ వ్యవస్థ కూడా ఉందని నేను అనుకుంటున్నాను కానీ అది కేవలం 10 శాతం మాత్రమే ఉందని నేను భావిస్తున్నాను.
ఇలాంటి వ్యవస్థలని ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా అవలంబిస్తున్నాయి. అందుచేత ఆ దేశాల్లో సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంది, అదే మాదిరిగా ఆ దేశాల్లో ప్రభుత్వ సేవలు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి.
అంతే కానీ ఒక వ్యవస్థను పూర్తిగా తొలగించి పాత పద్ధతిలో వెళ్ళుదామనడం మూర్ఖత్వం. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఆలోచించాలి కానీ ప్రజలకు నష్టం జరిగే ఆలోచనలు చేయకూడదు.
నేడు మన దేశ ప్రధాని మోడీ గారు కూడా డిజిటల్ ఇండియా అనే పేరుతో ఎన్నో పేర్లతో రూపకల్పన చేశారు వాటిలో కొన్ని విజయాలు
సాధించాయి మరికొన్ని విఫలమవుతున్నాయి కానీ వాటిని తొలగించడం లేదు, వాటిలో లోపాలను వెతికి వాటిని పరిష్కరించి
వాటిని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి.
దయచేసి ప్రతిపక్ష నాయకులు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ధరణి పోర్టల్ బాగుకోసం ఆలోచన చేయండి, బంగాళాఖాతంలో ప్రజల సొమ్మును కలిపే ఆలోచనలు చేయకండి. అది మీకు శ్రేయస్కరం కాదు.
ఏ ప్రభుత్వాలకి అధికారం శాశ్వతం కాదు, కేవలం మీరు ప్రజల శ్రేయస్సును కోరుకోండి, మీకు ఎల్లవేళలా వారి ఆశీర్వాదం ఉంటుంది.
No comments:
Post a Comment