Saturday, July 15, 2023

ప్రమాదంలో తెలంగాణ కాంగ్రెస్ - బూతు మాటలకి ఓట్లు రాలవు

 ప్రమాదంలో తెలంగాణ కాంగ్రెస్

అధికారం కోల్పోయి తొమ్మిది సంవత్సరాలు అవుతూ, ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావాలన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆశలు మరో మారు అడియాశలు అవుతున్నాయి.

రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నూతన శక్తిని ధైర్యాన్ని కల్పించిన, కర్ణాటక విజయం నూతన ఉత్తేజాన్ని నింపిన, ఎన్నిసార్లు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు గీతోపదేశం చేసిన మారినట్టే మారి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ని మళ్లీ అదే స్థాయికి నింపుతున్నారు ఇక్కడి నాయకులు.

అధికార పార్టీ ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించుతుంటే, వారి వ్యూహంలో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు బందీలు అవుతున్నారు, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆచి చూసి అడుగులు వేయాలి, ఆలోచించి మాట్లాడాలి, అందర్నీ కలుపుకపోయి స్పందించాలి.

కానీ ఇది కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీలో, మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధినాయకుడు విషయంలో స్పష్టంగా కనబడుతుంది, ఒక విషయం గురించి ఒక పాలసీ గురించి మాట్లాడినప్పుడు వివరాత్మకంగా విషయబద్ధంగా ప్రజలకు నొప్పి కలగకుండా మాట్లాడాలి, అలాగే అధికార పార్టీ వారు కానీ ఇతరులు కానీ విమర్శలు చేసినప్పుడు వాటికి వివరాత్మకంగా స్పందించాలి.

కానీ కాంగ్రెస్ తెలంగాణ అధినాయకుడు మాత్రం అలా స్పందించడం లేదు, ఏ విషయాన్ని వివరించిన బూతు పురాణమే ఆధారం అన్నట్టుగా, బూతే నా భవిష్యత్తు అన్నట్టుగా, ఏమి మాట్లాడినా బూతులతోనే సమాధానం చెప్పడం సరికాదు, కొన్నిసార్లు ఆ బూతులకి ప్రజలు ఆకర్షితులు కావచ్చు కానీ చివరకు ఆ బూతు మాటలు ఎన్నికల్లో ఓట్లుగా మారలేవు ఆ విషయం అర్థం చేసుకుంటే కాంగ్రెస్ బాగుపడుతుంది, కాంగ్రెస్ కార్యకర్తల కల నెరవేరుతుంది.



ఒక్క విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల్లో విమర్శలు సద్విమర్శలు అనేది సహజం, ఇలాంటివి ఎదురుపడినప్పుడు జాగ్రత్తగా స్పందించాలి, అంతేకానీ మాట్లాడిన వారిపై వ్యక్తిగత దాడులు, వారి వ్యక్తిగత సైన్యంతో బూతులు మాట్లాడిస్తూ చౌకబార రాజకీయాలుగా మార్చుతున్నారు. ఈ పద్ధతి కేవలం అధికార పార్టీ వారిపైనే కాదు సొంత పార్టీ వారిపై కూడా గతంలో కొనసాగించారు ఈ విషయం అందరికీ తెలిసిందే.

ఇలాంటి సమయంలో ప్రజలు కాంగ్రెస్ వైపు ఎలా చూస్తారో మీరే ఆలోచించండి.ఇది ఒక ఎత్తు అయితే.


మరో అతిపెద్ద ప్రమాదం కాంగ్రెస్ కి దగ్గర్లో ఉంది.

అదే తెలంగాణ కాంగ్రెస్ నుండి పుట్టిన మరో కాంగ్రెస్ పార్టీ, మాజీ కేంద్రమంత్రి పుంజాల శివశంకర్ గారి తనయుడు పుంజాల వినయ్ కుమార్ వారి సారథ్యంలో సామాజిక విలువలతో పురుడు పోసుకున్న పార్టీ "తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ".

ఈ పార్టీతో కాంగ్రెస్కి నూటికి నూరు శాతం నష్టం జరగబోతుంది, అది ఎలాగా అంటే కాంగ్రెస్ అంటేనే ఆధిపత్య కులాల, ఒక కులానికి పేటెంట్ గా అన్నట్టుగా మార్చేశారు, ఇదే ఆవేదన ఆ పార్టీలో ఉన్న బలహీన వర్గాల నాయకులు పదేపదే ప్రశ్నించి బయటికి వచ్చారు, మరికొందరు ఆ పార్టీలోనే ఇంకా పోరాడుతూనే ఉన్నారు (వారి జాబితాలో బట్టి విక్రమార్క గారు, హనుమంతరావు గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, మధుయాష్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు మరి ఇలా చాలామంది) పార్టీలో ఉన్న నాయకులకే సామాజిక న్యాయం లేదు అలాంటిది వారు ప్రజలకు ఏమి సామాజిక న్యాయం చేస్తారనేది ప్రశ్న.


ఇలాంటి సందేహాల నుండి పుట్టినదే తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ. 


రేపు జరగబోయే ఎన్నికల్లో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  టికెట్ల పంపకాల విషయంలో కానీ సామాజిక న్యాయం విషయంలో కానీ అన్యాయం జరిగినట్లయితే, కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీ వైపు చూసే అవకాశం మెరుగుగా ఉంది. ఇది ఒక బలమైన అంచనా. అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు, ఈ సమయంలో ఈ పార్టీ గనుక ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్లయితే కాంగ్రెస్కి భారీ నష్టం కలగవచ్చు.


అలాగే తెలంగాణ సమాజ కాంగ్రెస్ పార్టీ వారి పార్టీ సిద్ధాంతాలు బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరియు ఇతర ప్రజలకు వివరాత్మకంగా న్యాయబద్ధంగా ఉన్నాయి, అలాగే వారి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా బీసీ నాయకుడని ప్రకటించారు. మరెన్నో మార్పులు చూడబోతున్నాం. ఇలాంటి అంశాలు అన్నీ కాంగ్రెస్ పార్టీని పద్మవ్యూహంలో బంధిస్తున్నాయి.

చివరగా రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకులు ఆలోచనలు,బూతు పురాణాలు మాని కాంగ్రెస్ కార్యకర్తలకి బలాన్ని నింపాలని, అధికారం కోసం న్యాయబద్ధమైన చర్చలు చేస్తూ అధికారంలో రావాలని ఆశిస్తూ. 🙏

No comments:

Post a Comment