Monday, July 27, 2026

చట్టసభల్లో 'జై యువత': ధనబలాన్ని దాటి సామాన్య 21 ఏళ్ల యువతీ యువకులు అడుగుపెట్టగలడా?

 ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన జనాభా కలిగిన దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశ జనాభాలో దాదాపు 65 శాతానికి పైగా ప్రజలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కాగా, 15 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత శాతమే దాదాపు 27.5 శాతంగా ఉంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే, రాష్ట్ర జనాభాలో దాదాపు 47 శాతానికి పైగా యువత ఉంది. కానీ, ఈ జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా చట్టసభల్లో యువత ప్రాతినిధ్యం ఉందా అంటే నిరాశే ఎదురవుతోంది. మన పార్లమెంట్‌లో లేదా గడిచిన రెండు మూడు తెలంగాణ అసెంబ్లీలలో పరిశీలిస్తే, 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రజాప్రతినిధుల శాతం కేవలం 10 నుండి 12 శాతానికి మించడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో యువతకు కేటాయిస్తున్న టికెట్ల శాతం కూడా ఐదు నుండి ఎనిమిది శాతానికి మించకపోవడం గమనార్హం.


ఇలాంటి పరిణామాల మధ్య, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ విప్లవాత్మకమైన ప్రతిపాదనను లేవనెత్తారు. "21 సంవత్సరాలకే ఒక యువకుడు ఐఏఎస్, ఐపీఎస్ కాగా లేనిది.. చట్టసభల్లోకి అడుగుపెట్టి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఎందుకు కాకూడదు?" అని ప్రశ్నిస్తూ, పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించేలా రాబోయే రోజుల్లో తీర్మానం చేస్తామని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ నినాదానికి 'జై జవాన్, జై కిసాన్' తో పాటు 'జై యువత' ను జోడిస్తూ పిలుపునివ్వడం ఒక ముఖ్యమంత్రిగా ఆయన ధీరత్వానికి, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే సంకల్పానికి ప్రతీక. ఈ ఆలోచన వినడానికి ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ, నేటి రాజకీయ క్షేత్రంలో వేళ్లూనుకున్న కఠినమైన సామాజిక, ఆర్థిక యథార్థాల నేపథ్యంలో దీనిని సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

మొదటగా, 21 ఏళ్ల యువకుడు సివిల్ సర్వీసెస్ సాధించడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి మధ్య కొండంత వ్యత్యాసం ఉంది. ఐఏఎస్ లేదా ఐపీఎస్ పరీక్ష అనేది పూర్తిగా సదరు అభ్యర్థి ప్రతిభ (Merit), కష్టం, మేధస్సుపై ఆధారపడి ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా, స్వశక్తితో ఒక పేద లేదా బడుగు బలహీన వర్గానికి చెందిన యువకుడు ఆ అత్యున్నత స్థాయికి చేరుకోగలడు. కానీ, నేటి ఎన్నికల రాజకీయం ధనబలంతో ముడిపడి ఉంది. గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా వార్డ్ మెంబర్ పోటీకి రూ. 10 లక్షల నుండి 50 లక్షలు, పట్టణాల్లో కార్పొరేటర్ స్థాయికి రూ. 50 లక్షల నుండి కోటి రూపాయలు, ఇక ఎమ్మెల్యే ఎన్నికకు రూ. 50 నుండి 100 కోట్లు, ఎంపీగా పోటీ చేయడానికి రూ. 150 నుండి 200 కోట్లు ఖర్చు చేయాల్సిన దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ధనబలం, రియల్ ఎస్టేట్ రంగాలు, కాంట్రాక్టర్ల ప్రమేయం రాజ్యమేలుతున్న ప్రస్తుత వాతావరణంలో, 21 ఏళ్ల సాధారణ సామాన్య యువకుడు లేదా యువతి పోటీ చేయడం ఆచరణలో ఎంతవరకు సాధ్యమనేది ప్రాథమిక ప్రశ్న.

దీనిని మరింత లోతుగా పరిశీలిస్తే, కేవలం వయోపరిమితి తగ్గించినంత మాత్రాన గ్రామీణ, పేద, మధ్యతరగతి మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి బడుగు బలహీన వర్గాల యువతకు అవకాశాలు లభిస్తాయా అనేది మరో పెద్ద సవాలు. విద్యాభ్యాసం పూర్తయి, ఆర్థికంగా స్థిరపడని ఈ వయస్సులో రాజకీయాల్లోకి రావాలంటే విపరీతమైన వెన్నుదన్ను అవసరం. విద్యార్థి ఉద్యమాల నుంచో, ప్రజా పోరాటాల నుంచో వచ్చిన ఒకరిద్దరికి రాజకీయ పార్టీలు మినహాయింపుగా అవకాశమివ్వవచ్చేమో కానీ, మిగతా 99 శాతం సందర్భాల్లో ఈ చట్టం కేవలం రాజకీయ వారసులకు (Dynastic Politics) మరియు కోటీశ్వరుల పిల్లలకు మాత్రమే సునాయాసంగా చట్టసభల్లోకి అడుగుపెట్టే ఒక రహదారిగా మారే ప్రమాదం ఉంది.

కాబట్టి, అసెంబ్లీ సెషన్‌లో కేవలం వయోపరిమితి తగ్గింపుపై తీర్మానం చేయడమే కాకుండా, యువతకు నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు దక్కేలా కొన్ని ప్రాథమిక సంస్కరణలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. స్వీడన్, నార్వే వంటి ఐరోపా దేశాల మాదిరిగా ప్రతి రాజకీయ పార్టీ టికెట్ల కేటాయింపులో చట్టబద్ధంగా 'యువజన కోటా' నిబంధన తెచ్చేలా చర్చిం చాలి. అలాగే, ఇంద్రజిత్ గుప్తా కమిటీ (1998) సిఫార్సు చేసినట్లుగా ఎన్నికల వ్యయాన్ని నిబంధనలకు లోబడి ప్రభుత్వమే భరించే 'స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్' విధానంపై ఆలోచన చేయాలి. వీటితో పాటు, ఓటుకు నోటు ఇచ్చే సంస్కృతిని నిర్మూలించేలా అత్యంత కఠినమైన చట్టాలు తేవడం మరియు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను, సామాజిక స్పృహను పెంపొందించడానికి విశ్వవిద్యాలయాల్లో నైతిక విలువలతో కూడిన క్యాంపస్ పొలిటిక్స్ (విద్యార్థి సంఘాల ఎన్నికలు) ను పునరుద్ధరించడం అత్యంత కీలకం.

ముగింపుగా చెబుతుంటే, 21 ఏళ్లకే యువత చట్టసభల్లోకి రావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎంతో స్వాగతించదగినది. అయితే, రాజకీయాల్లో పేరుకుపోయిన ఈ 'ధనబలాన్ని', 'వ్యాపారాత్మక ధోరణిని' ప్రక్షాళన చేయకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా అవి ఉన్నత వర్గాలకు, రాజకీయ వారసులకే ఉపకరిస్తాయి. 'జై యువత' అనే నినాదం నిజమైన ప్రజాస్వామ్య సాధనంగా మారాలంటే, రూపాయి ఖర్చు లేకుండా సామాన్య పేద, బడుగు బలహీన వర్గాల యువకుడు చట్టసభల్లో ఎలా అడుగుపెట్టగలడో చూపించే సమగ్ర "ఎన్నికల సంస్కరణల"పై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఫలవంతమైన చర్చ జరగాలి!


No comments:

Post a Comment