Monday, June 1, 2026

పవన్ కళ్యాణ్ - ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదం: ఆవేశాలు పక్కన పెట్టి ఆత్మవిమర్శ చేసుకుందామా?

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా, టీవీ డిబేట్లలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మద్దతుదారులకి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకి మధ్య జరుగుతున్న "మాటల యుద్ధం" తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట్లో ఒక చిన్న 'మిస్ అండర్స్టాండింగ్' (తప్పుడు సమాచారం) వల్ల ప్రారంభమైన ఈ వివాదం, ఇప్పుడు ఏకంగా రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే స్థాయికి వెళ్లడం నిజంగా విచారకరం. రాజకీయ విమర్శల సరిహద్దులు దాటి, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిన ఈ వ్యవహారంపై కాసేపు ఆవేశాన్ని పక్కన పెట్టి నిష్పాక్షికంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



వివాదం ఎలా మొదలైంది? (ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్)

ఈ వివాదానికి గల మూలాలను పరిశీలిస్తే..
1. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తనకు అందిన ఒక సమాచారాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.
2. ఆ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందిస్తూ, ఆ ఆరోపణలను ఖండించారు.
3. అయితే, పవన్ కళ్యాణ్ గారి స్పందన రాగానే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు.

"నాకు రాంగ్ సోర్స్ వల్ల ఆ సమాచారం వచ్చింది, వాస్తవాలు తెలుసుకున్నాక నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా" అని చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
నిజానికి, ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తి స్వయంగా తప్పును అంగీకరించి వెనక్కి తగ్గినప్పుడే ఈ వివాదానికి అక్కడితో ఫుల్ స్టాప్ పడాలి. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారితీశాయి.

 ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి స్థాయిని మరువొచ్చా?

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కేవలం ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో పరిమితమైన వ్యక్తి కాదు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక గొప్ప పొలిటికల్ అనలిస్ట్. దశాబ్దాలుగా సమాజానికి విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్న వ్యక్తి. నిరంతరం రాజకీయ విశ్లేషణలు చేసే క్రమంలో ఎవరికైనా కొన్నిసార్లు సమాచార లోపం వల్ల పొరపాట్లు జరగడం సహజం. అంతేకానీ, దాన్ని పట్టుకుని రాజకీయ నాయకులు, వారి క్యాడర్ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
కానీ ఈ వివాదంలో జనసేన కార్యకర్తలు, నాయకులు ప్రొఫెసర్ గారిపై విపరీతమైన ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు దిగడం అత్యంత విచారకరం. ఆయన్ను "పేటీఎం బ్యాచ్" అని, "వైసీపీ మనిషి" అని, "శాలువాలు అమ్ముకునే వ్యక్తి" అని ఇష్టం వచ్చినట్లు కించపరిచారు. అంతటితో ఆగకుండా, ప్రొఫెసర్ గారికి మద్దతుగా నిలిచిన తెలంగాణ మేధావులను, ఉద్యమకారులను సైతం ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం ఏ రకమైన సంస్కృతి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడి అనుచరులు చేయాల్సిన పనేనా ఇది?

సమయానుకూల రాజకీయాలు - ప్రాక్టికల్ ఆలోచన

మరోవైపు, ఈ కలియుగ రాజకీయాల్లో ఎవ్వరూ 'స్వచ్ఛమైన హరిశ్చంద్రులు' కారు అనేది కూడా జగమెరిగిన సత్యం. ఇక్కడ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అంతా కాలానుగుణంగా సాగే వ్యూహాలే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిపై కొందరు వ్యక్తిగత దాడులు చేస్తూ.. ఆయన గతంలో పార్టీలు మార్చారని, మాటలు మార్చారని విమర్శిస్తున్నారు. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే.. ఈ రోజుల్లో ఒకే పాత సిద్ధాంతాన్ని పట్టుకుని కూర్చుంటే రాజకీయాల్లో మనుగడ సాధ్యమా? అలా మొండిగా వెళ్లిన వాళ్ళు ఈరోజు రాజకీయంగా ఏ తీరానికి చేరారో మన కళ్ళముందే ఉంది.

కాలంతో పాటు మారుతూ, సమయాన్ని బట్టి వ్యూహాలు మార్చుకుని.. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. కనీసం ఆ పదవి ద్వారా ఆయన కొంతమందికైనా రాజకీయంగా, పాలనా పరంగా న్యాయం చేయగలుగుతున్నారు కదా? ఆ వాస్తవాన్ని గుర్తించాల్సింది పోయి, ఇంకా పాత వ్యక్తిగత విషయాలనే పట్టుకుని వేలాడటం ఎంతవరకు సమంజసం?

ఇరువర్గాలకూ ఒకటే విన్నపం..

రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం, ఆహ్వానించదగ్గవి కూడా. కానీ అవి వ్యక్తిగత దూషణలుగా, ప్రాంతీయ విభేదాలుగా మారకూడదు. ఈ విషయంలో ఇరుపక్షాలూ కాస్త సంయమనం పాటించాల్సి ఉంది.

తెలంగాణ మేధావులకు, ఉద్యమకారులకు: 

ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు స్వయంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా, ఇంకా దీనిపై పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల సాధించే మైలేజ్ ఏముంది? ఇది అనవసరపు వైషమ్యాలకు దారితీయదా?

జనసేన కార్యకర్తలకు, అభిమానులకు:
బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఒక నాయకుడి అభిమానులుగా మీ బాధ్యత మరింత ఎక్కువ. మీ కౌంటర్లు కూడా అంతే హుందాగా, వైజ్ఞానికంగా ఉండాలి తప్ప.. ఒక సీనియర్ అనలిస్ట్‌ను, తెలంగాణ ఉద్యమకారులను తిట్ల పురాణాలతో దూషించి మీ స్థాయిని, మీ నాయకుడి స్థాయిని 

ముగింపు:
ఈ సోషల్ మీడియా యుద్ధాల వల్ల ఇరువర్గాలకూ వచ్చే లాభం ఏమీ లేదు సరికదా, ఇది సమాజానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఇప్పటికైనా ఇరువర్గాల వారు సమన్వయం పాటించి, ఒక చిన్న పొరపాటు వల్ల పెద్దదైన ఈ వివాదానికి ఇక్కడితో పులిస్టాప్ పెట్టాలని ఆశిద్దాం.

No comments:

Post a Comment